Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, March 25, 2016

Mana Kamareddy

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తూ… ఏడాదికి 36కోట్లు టర్నోవర్!ఆత్మ సంతృప్తి కోసం రైతుగా మారుదామని వచ్చిన అతనికి ఆ ఊర్లో రైతుల ఆత్మహత్యలు స్వాగతం పలికాయి. కోట్ల సంపాదనను, విలువైన సాఫ్ట్ వేర్ కంపనీని వొదులుకొని వ్యవసాయం చేద్దామని వచ్చిన అతనికి చేయాల్సింది వ్యవసాయం కాదు సాయం అని అర్దమయింది. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో తెలుసుకోవడం మొదలు పెట్టాడు. పంటలు పండవు, పండినా మార్కెట్ చేసుకోలేము, ఇది అతనికి దొరికిన సమాదానం. చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. తన కార్పోరేట్ తెలివి తేటలతో శాస్త్రీయ పద్దతిలో పంటలను పండించడం, పండించిన పంటలకు మార్కెట్ ని ఏర్పరచి 300 మంది రైతులకు దారి చూపించి బతుకుపై భరోసానిచ్చాడు. కోట్లను  వాడులుకోనివచ్చిన అతను వ్యవసాయ రంగంలో కోట్లను స్రుష్టించాడు.అతనే కర్నాటక రాష్టం లోని మాండ్య జిల్లకు చెందిన మధుచందన్.

కర్నాటక రాష్ట్రంలోని మాండ్యా మధుచందన్ స్వస్థలం. అమెరికాను వదిలి జన్మభూమికి వచ్చిన మధుచందన్ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. కానీ దేశంలోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు నమోదైన ప్రాంతం మాండ్యన్. అలాంటి ప్లేస్ లో వ్యవసాయంలో మధుచందన్ ఎలా రాణించగలడో అని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

కానీ రొటీన్ కు భిన్నంగా మధుచందన్ ఆలోచన చేశాడు. ఇప్పుడంతా హానికరమైన రసాయనాలతో పంటలు పండిస్తున్నారు. అలా పండిన ఆహారంలో ఎలాంటి రుచి ఉండటం లేదు. పైగా ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందని మధుచందన్ భావించాడు. వెంటనే ఆచరణలో పెట్టాడు. ముందుగా సేంద్రయ వ్యవసాయంలోని మెళకువలు అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా రంగంలోకి దిగాడు. కీబోర్డ్ ను రఫ్ ఆడించిన చేతులతో ట్రాక్టర్ నడిపించాడు. బురదమట్టిలోకి దిగి నాట్లు వేశాడు. రసాయనాలతో కాకుండా..పూర్తిగా సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాడు. తృణధాన్యాలు, కొబ్బరి, వేరుశెనగ, చెరుకు..ఇలా అన్ని రకాలు పంటలు వేశాడు. అలా అనతి కాలంలోనే మధుసూదన్ ప్రయత్నం సక్సెస్ అయింది. 13నెలల వ్యవధిలోనే లాభాలు రావడం ప్రారంభించాయి.

మండ్య ఆర్గానిక్ ఫార్మర్స్ కో ఆపరేటివ్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. దీనికి తోడు ఆర్గానిక్ మండ్య అనే బ్రాండ్‌ను కూడా రిజిస్టర్ చేశాడు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మండ్య గ్రామంలో నివసించే 240 మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం పట్ల మెళకులను, సూచనలపై అవగాహనను మధుచందన్ కల్పించేవాడు. దీని వల్ల బియ్యం, ధాన్యాలు, మసాలా దినుసుల వంటి పంటలను ఆ రైతులు పండించేవారు. ఇలా పండిన పంటలను స్వయంగా అమ్ముకునేందుకు ఆర్గానిక్ మండ్య అనే షాప్‌ను అత్యంత రద్దీగా ఉండే బెంగుళూరు-మైసూర్ హైవే పక్కన మధుచందన్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులకు మండ్య షాప్ ద్వారా రూ.999, రూ.1499, రూ.1999 చొప్పున గ్రాసరీ బాస్కెట్‌లను విక్రయించే వారు. వీటిలో వారికి అవసరమైన బియ్యం, పప్పు, నూనెలు, హెల్త్‌కేర్ ఉత్పత్తులు, మసాలా దినుసులు, శీతల పానీయాలు వివిధ రకాల పరిమాణాల్లో ఉంటాయి. కాగా ఈ షాప్‌కు పక్కనే మధుచందన్ స్వయంగా ఓ ఆర్గానిక్ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించాడు.

 ఫామ్ షేర్ అనే మరో వినూత్న ప్రయోగంతో నగరవాసులను ఆర్గానిక్ వ్యవసాయంలో భాగస్వాములను చేసేవాడు. దీని వల్ల నగరవాసులు మండ్య గ్రామంలో అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమిని రూ.35వేలకు అద్దెగా తీసుకుని దాంట్లో తమ సొంత ఆహారాన్ని పండించేందుకు వీలు కలుగుతుంది. ఇలా వారు ఇచ్చే అద్దె మొత్తంలో కొంత భాగం వారికి సహాయం అందించే రైతుకు వెళ్లేది. అయితే నగరవాసులు అలా పండించిన పంటలను మండ్య షాప్‌కు విక్రయించేలా వీలు కల్పించారు. లేదంటే తమతోపాటు తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా కార్యక్రమాలు నగర వాసుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తిని కలిగించేవి. దీనికి తోడు రైతులకు ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చేది.  కాగా ప్రారంభమైన నాటి నుంచి కేవలం 6 నెలల కాలంలోనే ఆర్గానిక్ మండ్య గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇప్పుడు ఆ షాప్ కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మొదటి 4 నెలల్లో షాప్ ద్వారా దాదాపు రూ.1 కోటి వరకు సంపాదించారు. కాగా ఇప్పుడు ఆ కో ఆపరేటివ్ సొసైటీలో 500 మంది రైతులు సభ్యులుగా ఉండి లబ్ది పొందుతున్నారు. వీరంతా దాదాపు 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇలా మధు దాదాపు 10వేల కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించాడు. ఇప్పుడు ఏడాదికి 36కోట్ల రూపాయల టర్నోవర్ తో వ్యాపారం చేస్తున్నాడు మధుచందన్.

మధుచందన్ జీవితం..నేడు ఎందరికో ఆదర్శం. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవాలన్న దానికి మధుచందన్ ఓ రోల్ మోడల్ గా మారారు. తనతో పాటు 300మంది రైతుల జీవితాలను బాగు చేసిన మధుచందన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనను స్థానిక రైతులు..మధు అన్నా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మధుఛందన్ లాంటి రైతులు మన రాష్ట్రంలో ముఖ్యంగా మన కామారెడ్డి ప్రాంతంలో వున్న ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ మీ మన కామారెడ్డి.

Source: Mana Telugu News


Subscribe to this Mana Kamareddy Portal via Email :