
ఈ రోజుల్లో విద్యా వ్యవస్థ ఒక కమర్షియల్ బిజినెస్ గా మారిపోయింది. ఈ ఘనత మన కార్పొరేట్ స్కూళ్లది. ఒకరకంగా చెప్పాలంటే అవి స్కూళ్లు కాదు. పిల్లలని మర మనుష్యుల్లా తయారు చేసే కార్ఖానాలు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ఇరుకైన తరగతి గదులు. ఆటస్థలం, ఆటవిడుపు లేక ర్యాంకుల కోసం పిల్లల బాల్యాన్ని హరించే స్థలాలుగా మారిపోయాయి.
కానీ ఆ స్కూళ్లో అలాంటివేవీ కనిపించవు. ఎవరికి నచ్చింది వారు చదువుకోవచ్చు... ఒక్క రూపాయి చెల్లించకుండా చదువుకోవచ్చు. ఎల్కేజీకే వేలకొద్దీ ఫీజులు ముక్కుపిండి వసూలు చేసి.. కిలోలకొద్దీ పుస్తకాల భారాన్ని పిల్లలపై మోపుతున్న ఈ రోజుల్లోనూ ఇలాంటి స్కూళ్లు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా?
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో కెంచలగూడు అనే గ్రామంలో ఉన్న ఆ స్కూలు పేరు ‘కలియువ మానే’.. దాన్ని నడిపిస్తున్న ఆ వ్యక్తి పేరు ఎంఆర్ అనంత్ కుమార్. బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలని.. ర్యాంకులు, గ్రేడ్లు లేని స్కూళ్లు రావాలన్నది అతని లక్ష్యం. చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. తానే ప్రత్యేకంగా అలాంటి ఓ స్కూల్ స్థాపించారు. దాని పేరు కలియువ మానే. దీనర్థం ‘లెర్నింగ్ హోమ్’ అని. ప్రయోగాత్మకంగా మొదలైన ఈ స్కూల్లో ఎక్కువగా నిరుపేద విద్యార్థులే చదువుతున్నారు. ముందే నిర్ణయించిన సిలబస్ ప్రకారం పరీక్షలు పెట్టడాలు.. దాని ద్వారా విద్యార్థులను ర్యాంకులంటూ వేరు చేయడాలూ ఈ స్కూల్లో ఉండవు.
ప్రతి విద్యార్థిని వాళ్ల విద్యాస్థాయిని బట్టి వర్గీకరిస్తారు. ఒకే స్థాయి ఉన్న పిల్లలను ఒక బృందంగా చేస్తారు. ఆ తర్వాత వారి స్థాయికి తగినట్లే ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తారు. ఈ స్కూల్లో 15-16 ఏళ్లు చదివిన విద్యార్థులకు స్టేట్ లెవల్ బోర్డు ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఇలా పరీక్షలు రాసిన విద్యార్థులంతా మంచి ఫలితాలు సాధించడం విశేషం.
‘కలియువ మానే’ బట్టీ చదువులకు పూర్తి వ్యతిరేకం. వారి సిలబస్ ఆచరణాత్మకంగా ఉంటుంది. తప్పనిసరిగా చదవాల్సిన వాటితో పాటు ఐచ్ఛిక పాఠ్యప్రణాళిక కూడా ఉంటుంది.
విద్యార్థులు వాళ్ల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా చదివేందుకు వీలుగా ఈ ఆప్షనల్ సిలబస్ కూడా పెట్టారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం మొత్తం 102 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 34 మందికి ట్రస్టే వసతి ఏర్పాట్లు కూడా చేసింది. అయితే సాంప్రదాయేతర పాఠశాల కావడంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు దొరకడం కూడా కష్టంగా మారింది.
ఫౌండర్ అనంత్ కుమార్ కూడా స్కూల్ మొదలుపెట్టే ముందు ఎంతో అధ్యయనం చేయాల్సి వచ్చింది. ‘మా సాంప్రదాయేతర పద్ధతులను అలవాటు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
అయితే మా సిద్ధాంతాలు, బోధనా పద్ధతులకు మెల్లగా అలవాటు పడిన తర్వాత బోధించడం కాస్త సులువైంది’ అని ఆయన చెప్పారు.
ఇంజినీరింగ్ చదివిన అనంత్ కుమార్ మొదట్లో 12 ఏళ్లు రకరకాల ఉద్యోగాలు చేశారు. కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ఏడాదిన్నరపాటు గడపడంతో ఆయన అలోచనా పద్దతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది.వివేకానందుని సిద్ధాంతాలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
మొదట అనంత్ కుమార్ బతుకుతెరువు కోసం ఓ కోచింగ్ సెంటర్ లో లెక్చరర్ గా పనిచేస్తూ గ్రామీణ విద్యార్థుల కోసం ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు. గ్రామాల్లో ఉండే పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారానే 2005, జూన్ లో తన డ్రీమ్ స్కూల్ కలియువ మానేను 14 మంది విద్యార్థులతో ప్రారంభించారు.
కలియువ మానేలాంటి స్కూళ్లు మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా వుంది. గ్రేడ్లు, ర్యాంకులే లక్ష్యంగా సాగుతున్న మన విద్యావ్యవస్థ మారాలని కోరుకుంటూ..
మన కామారెడ్డి