Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Sunday, April 03, 2016

Mana Kamareddy

ఖతర్ టూ కాచాపూర్... ఓ కన్నీటి గాథ !


న్నఊళ్లో బతకలేక... వేల మైళ్లు వలసపోయిన మనిషి అచేతనంగా తిరిగివచ్చాడు. బతుకుదెరువుకోసం ఉన్న ఊరును, కన్న తల్లిని వీడివెళ్లిన మనిషి జీవితం విషాదంతో ముగిసింది. దేశం కాని దేశంలో ప్రమాదానికి గురైన సిద్ధిరాములు గురువారం నగరంలో కన్నుమూశాడు. పరాయిదేశంలో అనాథగా ఉన్న సిద్ధిరాములుని ఖతర్ నుంచి నగరానికి తీసుకురావడానికి తొమ్మిది నెలలు పట్టింది. అచేతనంగా పడిఉన్న సిద్ధిరాములుని బతికించుకోవడం కుటుంబసభ్యుల వల్ల కాలేదు. చివరకు.. వలస పోయిన మనిషి.. లోకాన్ని వీడివెళ్లాడు.
నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్‌కి చెందిన సిద్ధిరాములు.. రోజు కూలీ చేసుకొని బతికేవాడు. కరువు కన్నెర్ర చేయ‌డంతో చేతిలో పనిలో లేక... కుటుంబం గడవక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒకవైపు అప్పుల భాదలు, మరో వైపు పిల్లల చదువులు... కుటుంబ భారం ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఉన్నఊళ్లో బతక లేక.. వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. గల్ఫ్‌లో ఏదైనా పనిచేసుకొని వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చవచ్చిని కలలు కన్నాడు. అలా.. గత జూన్ 24న బతుకుదెరువు కోసం ఖతర్ వెళ్లిన సిద్ధిరాములు కలలు కల్లలయ్యాయి. వేల మైళ్లు దాటి వలససోయిన సిద్ధిరాములు ఖత్తర్‌లో భవన నిర్మాణ పనిలో చేరాడు. వెల్లిన మూడో రోజు భార్య రేణుకకు ఫోన్ చేసి.. పని దొరికిందని సంతోషంగా చెప్పాడు. అంతే.. మళ్లీ అతని గొంతు వినపడలేదు. పనిలో చేరిన 20 రోజులకే అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నాడు. గత జూలై 2న ప్రమాద వశాత్తు పనిచేస్తున్న భవనం మూడవ అంతస్థు నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సిద్ధి రాములును స్థానిక అసుపత్రిలో చేర్పించారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో పాటు తలకు బలమైన గాయమవ్వడంతో మనుషుల్ని గుర్తించలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో అక్కడి అధికారులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కి సమాచారం చేరవేశారు. కానీ సరైన సమయంలో సిద్ధిరాములుని దేశానికి తీసుకురావడంలో జాప్యం జరిగింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి సిద్ధిరాములుని ఇక్కడి వరకు తీసురావడం కష్టమైన పనే. రాయభార కార్యాలయానికి సంబంధించిన డాక్యుమెంటేషన్.. ఇక్కడ చికిత్స కోసం వైద్యులను సంప్రదించడం.. కుటుంబ సభ్యులను సమన్వయం చేయడం వంటి పనుల్లో కొద్దిమంది తెలంగాణ వాదులు చొరవను ప్రదర్శించారు. ఫలితంగా... తొమ్మిది నెలల తరువాత చివరకు అచేతన స్థితిలో ఉన్న సిద్ధిరాములును దేశానికి తీసుకురాగలిగారు. వారం రోజులుగా గాంధీ ఆసుపత్రి న్యూరో విభాగంలో చికిత్స పొందుతున్న సిద్ధిరాములు గురువారం ఉదయం కన్నుమూశాడు.
తీరని కష్టాలు...
ఆసుపత్రిలో సిద్ధిరాములు శవం పక్కన ధీనంగా భార్య రేణుక, అతని తల్లీ కన్నీరు మున్నీరవుతూ కనిపించారు. కనీసం శవాన్ని మర్చురీకి తరలించేందుకు సాయంగా మనుషులు కూడా లేరు. బతుకుదెరువు కోసం ఉన్న ఊరును.. కన్నతల్లిని వీడిన సిద్ధిరాములు.. తిరిగి శవంగా సొంతగడ్డకు వెళ్తున్నాడు. ఎంత విషాదం. నాలుగు డబ్బులు వస్తే... కడుపునిండా పిల్లలకు తిండిపెట్టొచ్చని, మంచి చదువు చెప్పించవచ్చని కలలు కన్న సిద్ధిరాములు... అవేవీ చేయకుండానే కన్నుమూశాడు. ఇప్పుడు... పుట్టెడు అప్పుల్తో ఇద్దరు పిల్లలతో అతని భార్య బోరున విలపిస్తోంది. పిల్లల ఆకలి తీర్చేందుకు ఆ తల్లి బీడీలు చేస్తుంది. నెలంతా బీడీలు చేస్తే... చేతికొచ్చేది రూ.800. తీరుతాయనుకున్న కష్టాలెలాగూ తీరనేలేదు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మనిషీ దూరమయ్యాడు. ఆ తల్లీ, బిడ్డల భవిష్యత్తు ఎంత భయానకంగా ఉండబోతుందో చెప్పడం కష్టం.
Article Credit: Avani News


Subscribe to this Mana Kamareddy Portal via Email :