Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, July 07, 2016

Mana Kamareddy

అందమైన ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ భీమేశ్వరాలయం (సంతాయిపేట)


నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పుస్తకాలను తిరగేస్తుంటే ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న సంతాయిపేట్‌లో ప్రాచీనమైన భీమేశ్వరాలయం ఉందని కనిపిస్తుంది. తెలుగుదేశంలో ఎక్కడ భీమేశ్వరాలయం ఉన్నా దాని గురించి పరిశోధిస్తే ఎంతో చరిత్ర వెల్లడవుతుంది. అలాగే ఈ సంతాయిపేట భీమేశ్వరాలయం పట్ల ఉత్సుకతను పెంచుకొని ఆ ఊరికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్తాయి.

ఆలయ చరిత్ర :

ఇక్కడి భీమేశ్వరాలయ సమూహంలో తెలంగాణలో గత మూడు- నాలుగు వేల ఏళ్ళుగా చోటు చేసుకున్న అన్ని మత పరిణామాలు కన్పిస్తాయి. చరిత్రకు తెలిసినంతవరకు తెలంగాణ అతి ప్రాచీన కాలంలో నాగభూమిలో భాగం. ఇక్కడి ప్రజలు మొదట నాగ దేవతలను పూజించేవారు. కాబట్టి ఆలయంలో నాగ అంశ లేని ప్రతిమలు అరుదు. పాండవుల్లోని భీముడు నాగలోకానికి వచ్చి గిరిజన కన్య హిడింబిని పెళ్ళి చేసుకుని ఉత్తర తెలంగాణ ప్రాంతీయులకు ఆరాధ్య దైవమయ్యాడు. భీముడి చరిత్ర – ఆలయాలను మనం హిండిబాద్రి (లింబాద్రి), పెద్దయ్యగుట్ట (లక్షెట్టిపేట దగ్గర), దొంతపూర్ భీమన్నగుట్ట (ధర్మపురి దగ్గర), వేముల వాడ (భీమన్నగుడి), ధర్మారం భీమన్నగుట్ట, సానబండ… ఇలా ఎన్నో చోట్ల చూడవచ్చు. సంతాయిపేట ఆలయ ఆవరణలో ఉన్న ఒక పెద్ద బండరాయికి చెక్కిన పాండవుల విగ్రహాల్లో భీముడ్ని కేంద్రస్థానంలో చెక్కడం కూడా భీముడి ఆరాధనా ప్రాశస్తాన్ని తెలుపుతుంది. అలా భీముడు ప్రధాన ఆరాధ్యదైవం కాబట్టే ఇక్కడి ఆలయానికి భీమేశ్వరాలయమని, వాగుకు భీమేశ్వరవాగు అనే పేర్లు స్థిరపడ్డాయి. భీముడి చరిత్ర సుమారు ఐదువేల నూట యాభై సంవత్సరాల కిందటిదని పురాతత్వ, వాస్తుజ్యోతిష్యశాస్త్ర పరిశోధనలు ఇటీవల నిరూపించాయి.
గర్భగుడి ముందు మంటపం..గర్భగుడిలో లింగాకారంలో వున్న శ్రీ భీమేశ్వర స్వామి వారు..


సంతాన దేవతల సంతాయి పేట : 

ప్రజలకు ప్రధానంగా కావలసింది సంతానం, పాడిపంటలు. దేవతలను కోరుకునేవి, కొలిచేది ఇందుకే. ఇక వాటి సృష్టి జరిగేది సంభోగ ప్రక్రియ ద్వారానే కాబట్టి, సంతాయిపేటలో మనకు ఈ రెండు రకాల విగ్రహాలు కన్పిస్తాయి. సంతాయిపేట ఆలయాల్లో అత్యంత ప్రాచీనమైన ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంది. అందులో ఒక పాలిండ్ల దేవత బాలున్ని ఒడిలో పెట్టుకొని ఉంది. మరో పాలిండ్ల నాగదేవత పక్కనే ఉంది. పాలిండ్లు, బాలుడు సంతాన సౌభాగ్యానికి చిహ్నాలు. భీమేశ్వరాలయ దక్షిణ భాగంలో ఒక పొడవైన రాయికి సప్తమాతృకల విగ్రహాలు (6) వారి వాహనాలతో సహా చెక్కి ఉన్నాయి. అయితే ఇక్కడ స్థాపిత సాంప్రదాయం ప్రకారం కాకుండా గణపతి విగ్రహం విడిగా చెక్కబడి ఉంది. దాని తలపై కిరీటం లేదు, కాళ్ళ కింద ఎలుక లేదు, జందెముండవలసిన చోట నాగబంధం ఉంది. ఇవన్నీ ఆ విగ్రహాలు తొలి చారిత్రక యుగం (సుమారు రెండు వేల ఏళ్ళు) నాటివని రుజువు చేస్తున్నాయి.
సప్తమాతృకల విగ్రహాలకు ఎదురుగా ఒక పెద్ద రాయి కింద ఒక చిన్న గుహ ఉంది. దాన్ని మొదట్లో యోనిగా భావించి సంతాన దేవతగా పూజించారు. తదనంతర కాలంలో ఆ గుహలో రతీ- మన్మథుల విగ్రహాన్ని పెట్టారు. ఈ విగ్రహానికి దగ్గరలో రెండు గజమెత్తు రాళ్ళను నిలబెట్టి, వాటి మీద మరో రాయిని బోర్లించి ఒక “ఇరుకు సందు”ను ఏర్పాటు చేశారు. దాని తేరు ‘యమకోడం’. ఆ సందులో నుంచి ఈగినవారికి సంతానం అవుతుందని నమ్మకం.
తొలి తెలుగు మహారాజులు శాతవాహనులు తమ తల్లుల పేర్లను తమ పేర్ల ముందుంచుకునేవారు. వారి తరువాత ఇక్షాకులు, విష్ణుకుండులు, చాళుక్యులు తాము ‘హారీతి’ (సంతానదేవత) పుత్రులమని తమ శాసనాల్లో చెప్పుకున్నారు. కాబట్టి వీరి పాలనా కాలంలో (క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నుండి క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం వరకు) సంతాయిపేటలో మాతృదేవతారాధన కొనసాగిందని చెప్పవచ్చు.
పాండవులు..


శ్రీ గణపతి

రతి మన్మధులు..


సంత-అయి-పేట :

అయితే సంతాయిపేట పేరును పరిశీలించినప్పుడు ఆ మాతృదేవతారాధన ఇంకా ప్రాచీనమైందనీ తేలుతుంది. ‘సంతాయిపేట’ అనే పదబంధంలో సంత, అయి, పేట అనే మూడు పదాలున్నాయి. “అయి” అంటే ఇనుము. అంటే, సంతాయిపేట ఇనుము కొనుగోలు, అమ్మకాలు జరిగే సంత అన్నమాట. ఆ సంత జరిగిన స్థలం భీమేశ్వరవాగు ఎడమ ఒడ్డున గుట్టబోరుపై ఎకరం వైశాల్యంలో విస్తరించి ఉంది. ఆ బోరును ప్రత్యేకంగా చదును చేసినట్లు గమనించవచ్చు. ఇక్కడ ఇనుము అమ్మకాలు జరిగినట్లు చెప్పడానికి ఆధారం ఇక్కడ కనిపించే ఇనుప చిట్టాలు. సంతాయిపేటకు తూర్పున కిలోమీటరు దూరంలో ‘చిట్యాల’ అనే ఊరు కూడా ఉంది. అంటే, సంతాయిపేట ప్రాంతంలో ఇనుము తయారయ్యేదన్నమాట. ఇందుకు నిదర్శనంగా ఇరవై ఎకరాల్లో విస్తరించిన ఇనుప చిట్టాలగుట్ట బోరును ఇక్కడికి ఉత్తరంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేమికలాన్‌లో చూడవచ్చు.
ఈ ప్రదేశం ఇనుము తయారీతో పైకొచ్చింది. కనుక ఇక్కడేర్పడిన తొట్టతొలి రాజ్యం పేరు ‘అశ్మక జనపదం’. అంటే ఇనుపరాళ్ళ దేశం అని అర్థం. అశ్మక జనపదం క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన పాణిని ‘అష్టాధ్యాయి’లో ప్రస్తావించబడింది. ఇనుప సంస్కృతి ఉన్న చోటల్లా ‘మమ్మాయి’ గుడి ఉంటుంది. మమ్మ+అయి అంటే లోహ (ఇనుప) దేవత అని అర్థం. అశ్మక జనపద కాలంలో ప్రజలు బృహత్ శిలలతో సమాధులు, ఆలయాలు కట్టుకొనే వారు. అలాంటి రాక్షసగుళ్ళు, దాన ఆలయాలను భీమేశ్వరాలయ ఆగ్నేయంలో చూడవచ్చు.

చారిత్రక యుగంలో విష్ణుకుండులు (క్రీ.శ. 4-6 శతాబ్దాలు) రామలింగేశ్వర ఆలయాలను కట్టించారు. వీరి కాలంలో మొదట ఇటుకలతో, తరువాత రాయితో ఆలయాలను కట్టేవారు. వారు సంతాయిపేటలో ఆలయాలను కట్టించారనడానికి నిదర్శనాలుగా ఆలయానికి ఉత్తరంగా ఒక పెద్ద రాయిపై చెక్కిన రామ -లక్ష్మణ- ఆంజనేయ విగ్రహాలను, ప్రధానాలయం ముందటి రామలింగాన్ని, ప్రధానాలయపు కుడివైపు గోడ ఇటుకలను చూడవచ్చు.
విష్ణుకుండుల తరువాత రాజ్యాధికారం నెరపిన తొలి చాళుక్యుల కాలంలో (7, 8 శతాబ్దాలు) ఇటుకల గుడి స్థానంలో రాతి గుడిని కట్టారు. ఆలయ ద్వార స్తంభాలకు పూర్ణకుంభం పైన ఏడు రంధ్రాల పిల్లనగ్రోవిని చెక్కడం చాళుక్యశైలి ప్రత్యేకత. భీమేశ్వరాలయ గర్భగృహం ముందున్న ద్వారానికి ఇరువైపులా ఈ శైలి శిల్ప చెక్కడాలను చూడవచ్చు. ఇదే శైలి శిలాలను ఈ చాళుక్యులే కట్టించిన ఆలంపురం దేవాలయాల్లోనూ, ద్వారతోరణంలోనూ గమనించవచ్చు. వీరి కాలం చివరి దశలో కాలాముఖ, కాపాలిక మొదలైన తాంత్రిక మతశాఖలు పుట్టాయి. ఆ శాఖల్లో కాలభైరవున్ని కొలవడం ఆనవాయితీ. అలాంటి కాలభైరవ విగ్రహాన్ని భీమేశ్వరాలయ ఉత్తరాన ఒక రాయిపై చూడవచ్చు.
క్రీ.శ. 8,9,10 శతాబ్దాల్లో ఈ ప్రాంతం రాష్ట్రకూటులు, వారి సామంతులైన వేములవాడ చాళుక్యుల ఏలుబడిలోకి వచ్చింది. వారు జైన మతాన్ని అవలంబించారు. కాబట్టి వారి కాలంలో సంతాయిపేటలో జైన మతం వర్ధిల్లింది. అప్పుడు సంతాయిపేట దగ్గరలోని సిద్ధులగుట్ట, దేమికలాన్ గడి గుట్టలు కూడా జైనమత స్థావరాలే. జైనులు కూడా వినాయకున్ని, చక్రేశ్వరి దేవిని పూజించేవారు. జైనశైలికి చెందిన వినాయక విగ్రహం భీమేశ్వర లింగానికి ఉత్తరాన ఉంది. ఈ వినాయకుడు సిద్ధ యోగాసన స్థితిలో ఎలుక లేకుండా ఉన్నాడు. ఇక భీమేశ్వరాలయానికి ఆనుకొని దక్షిణంగా ఉన్న ఆలయంలో ఉన్నది నిజానికి జైన దేవత చక్రేశ్వరి విగ్రహం. భీమేశ్వర లింగం పానవట్టంలో కూడా మొదట జైన విగ్రహమే ఉందేదని దాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అసలు భీమేశ్వరాలయాలు – వేములవాడలోగాని, సంతాయిపేటలో గాని – ప్రాచుర్యంలోకి వచ్చిందే వేములవాడ చాళుక్యుల కాలంలో, ఇక్కడి భీమేశ్వరాలయం, దాని పక్కనున్న ఆలయం గోపురాలు / శిఖరాలు జైన వాస్తుశైలికి చెందినవే.
పార్వతిదేవి గా కొలువబడుతున్న చక్రేశ్వరి దేవి అమ్మవారు..

ఇక జైనులు చక్రేశ్వరి ఆలయాన్ని కడుతున్నప్పుడే వేములవాడ చాళుక్యులు అధికారాన్ని కోలోయినట్లుంది (క్రీ.శ. 953).కాబట్టే ఆ దేవాలయ గోడల నిర్మాణం పూర్తి కాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన కళ్యాణి చాళుక్యుల కాలంలో (10-12 శతాబ్దాలు) సంతాయిపేట ఆలయాలు అత్యున్నత స్థితిని అనుభవించాయి. తొలితరపు పానవట్టపు పీఠాలు ఒకదాని మీద ఒకటి ఉండగా వాటి మీద ప్రస్తుతమున్న భీమేశ్వరలింగాన్ని ప్రతిష్టించారు. అంటే మూడవసారి జరిగిన లింగ ప్రతిష్టను మనమిప్పుడు చూస్తున్నామన్నమాట. ఈ మూడు విగ్రహ ప్రతిష్టలు కూడా ఒకదాని మీదొకటి ఒకే గుహాలయంలోనే జరుగడం, వాటి చుట్టే ఆలయాన్ని నిర్మించడం గమనార్హం. గర్భగృహం ముందు విశాలమైన నవరంగ మంటపాన్ని కట్టింది వీరికాలంలోనే. మంటపం పైకప్పుకున్న ‘అష్టదళ పద్మ’ శిల్పాలు, మంటపం చుట్టూ వున్న అరుగులు వారి నిర్మాణ శైలికి నిదర్శనాలు. చక్రేశ్వరి ఆలయం పార్వతిదేవి గుడిగా మారింది.

అందమైన ప్రకృతిఒడిలో... 

సంతాయిపేట నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలంలో మెదకు జిల్లా సరిహద్దు గ్రామంగా ఉంది. హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వెళ్ళే రూట్‌లో 10 కిలోమీటర్లు ప్రయాణించాక వచ్చే తాడ్వాయి నుంచి దక్షిణం వైపు మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే సంతాయిపేటను చేరుకోవచ్చు.
తాడ్వాయి మండలంలోనే దేమికలాన్ గ్రామ వాయువ్య మూలన ప్రారంభమైన వాగు సంతాయిపేటను వాయువ్య మూల నుండి పడమర మీదుగా చుట్టి దక్షిణం, ఆగ్నేయం దిశగా ప్రవహించి గోదావరి నదికి ఉపనది ఐన మంజీరా నదిలో కలుస్తుంది. సంతాయిపేట చుట్టూ ఈ వాగు ప్రయాణమంతా అడవులు, కొండల గుండానే సాగుతుంది. కాబట్టి చూడముచ్చటగా ఉంటుంది. దక్షిణంగా సాగుతున్న వాగు సడన్‌గా తూర్పు వైపు మలుపు తిరగడం మరింత అందంగా ఉంటుంది. కాబట్టే అదే చోట ఈ భీమేశ్వరాలయాన్ని కట్టారు… ఊరికి పడమరన కిలోమీటరు దూరంలో, ఆలయం కూడా పశ్చిమాభిముఖంగానే ఉంది.
గుడి ముందు సేలయేరు..

y>

కామారెడ్డి పరిసరాలలో ట్రెక్కింగ్,బోటింగ్ లకు అనువైన ఏకైక ప్రదేశం...

దేవుడి ఉనికి ఎలా ఉన్నా ఇక్కడి దేవాలయ పరిసరాల్లో ఉన్న ప్రకృతిని చూశాక మాత్రం నాస్తికుడు కూడా ప్రకృతే పరమాత్మ అనక మానడు. అంత అందమైనది భీమేశ్వరాలయ ప్రకృతి సోయగం, బహుశా దానికి పరవశించే స్థానిక పండితుడు డా॥ అయాచితం నటేశ్వర శర్మ పుష్కర కాలం కిందటే“శ్రీ భీమేశ్వర క్షేత్ర వైభవం” అనే పుస్తకం రాశారు.
ఆలయాన్ని వాగు దాటిన తరువాతే చేరుకుంటాం. అంటే మన కాళ్ళు శుభ్రమవుతాయి – అప్రయత్నంగానే. అయితే ఈ వాగు దాటే చోటు నుంచి మనకు కదలబుద్ధి కాదు. కారణం… ఇక్కడ నిల్చుని ఎటువైపు చూసినా కనుచూపు మేరలో పచ్చని అడవులతో కూడిన గుట్టలు, వాటి మధ్య లోయలో బండల పై నుండి పల్టీలు కొడుతూ పారుతున్న ఈ వాగు మలుపు చాలా అందంగా కన్పిస్తాయి. ఈ అందానికి అక్కడి గుట్టలు, చెట్లు, సెలయేళ్ళపై నుంచి వీచే చల్లగాలులు ఆహ్లాదాన్ని చేరుస్తాయి.
ఇక మనకు కాలు నిలవదు. కొంతసేపైనా ఆ వాగులో ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్‌కి ప్రత్యేకత ఉంది. ట్రెక్కింగ్ సాధారణంగా గుట్టలపైన గాని, అడవుల్లోగాని, నదులు-సముద్ర తీరాల్లోగాని చేస్తారు. అంటే ఏదో ఒక చోట మాత్రమే ట్రెక్కింగ్ చేస్తారు. ఇక్కడ మాత్రం మూడు రకాల ట్రెక్కింగ్‌లను ఒకేసారి చేయవచ్చు. ఇలా కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయగలిగిన వారికి ఒక విస్మయం కలుగుతుంది. అది : భీమేశ్వరాలయం దగ్గర సడన్‌గా పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు తిరిగి పారుతున్న వాగు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మళ్ళీ సడన్‌గా పశ్చిమం వైపు తిరిగి పారడం.
బొటింగ్ కి అనువుగా వుండే వాగు..

ట్రెకింగ్ చేస్తున్న క్రమంలో మనల్ని ఎన్ని రకాల పక్షుల కిలకిలలు అలరిస్తాయో చెప్పనలవి కాదు. అయితే అదే సమయంలో మనకు “కొన్ని సార్లు ఎలుగుబంట్ల అరుపులు కూడా వినపడవచ్చు” అనే స్థానికుల మాట వినగానే, “అంటే ఇక్కడి ట్రెక్కింగ్ నిజంగా సాహసోపేతమైనదన్నమాట” అనుకోవలసి వస్తుంది.
వాగు దాటే చోటు / దేవాలయానికి ఉత్తర దిశలో వాగుకు అడ్డంగా చిన్న ఆనకట్ట కట్టారు. ఆ కట్ట పై నుండి పారుతున్న నీళ్ళలో నడవడం సరదాగా ఉంటుంది. ఆనకట్ట ఎడమ పక్కన నిల్చుని గుట్టల్లోకి గుంకుతూ ఆనకట్ట వెనుక నిల్చిన నీళ్ళల్లో ప్రతిబింబిస్తున్న సూర్యుని అందాలను చూసి తీరాల్సిందే. ఈ ఆనకట్టకు పైన ఈశాన్యంలో గుట్టల మధ్య ఏర్పడిన చెరువు అందాలను కూడా చూడాల్సిందే. ఆ చెరువులో రాష్ట్ర పర్యాటక శాఖ బోటింగ్, ఏంజిలింగ్ (చేపలు పట్టడం) సౌకర్యాలను ఏర్పాటు చేసి లేక్‌సైడ్ రెస్టారెంట్‌ని కట్టిస్తే పర్యాటకులను విపరీతంగా ఆకర్షించవచ్చు.

అలా వేయి సంవత్సరాలు క్రితం వరకు వేయి సంవత్సరాలుగా కడుతూ వచ్చిన భీమేశ్వరాలయ సమూహం తరువాత వేయి సంవత్సరాలుగా పూజాదికాలకు నోచుకుంటూ వస్తున్నది. ఈ ఆలయంలోనే పూజారి కుటుంబాలు నివసిస్తూ ఉండేవనడానికి నిదర్శనాలుగా రంగమంటపం కుడివైపు అరుగుపై నున్న రోలు గుంత, నూరుడు రాయి అడుగు ఆనవాళ్ళను చూడవచ్చు. ఇలా వేల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రకృతి ఒడిలో పొదిగిన ఈ క్షేత్ర పరిసరాలు మంచి పిక్నిక్ స్పాట్స్ అవుతాయి. వ్యాసంలో పేర్కొన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులకు ఒక మంచి పర్యాటక కేంద్రంను అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది.

ఆలయానికి ఇలా చేరుకోవచ్చు..


కామారెడ్డి బస్టాండ్ నుండి ప్రతి గంటకు ఒక బస్సు సంతాయిపేట వెళ్ళటానికి అందుబాటులో ఉంటుంది. అలాగే మెదక్ నుండి కూడా గుండారం మీదుగా, ఎల్లారెడ్డి నుండి తాడ్వాయి మీదుగా సంతాయిపేట గ్రామానికి చేరుకోవచ్చు. సంతాయిపేట గ్రామం నుండి సుమారు 2 కి.మీల దూరంలో ఆలయం ఉంటుంది.
Article Credit: ద్యావనపల్లి సత్యనారాయణ
 Mana Telangana Paper


Subscribe to this Mana Kamareddy Portal via Email :