
ఈ సంఘటన మన సమాజంలో గురువుల పాత్రను, సమాజంతో గురువులకు అనుబంధం ఎలా ఉంటుందో చెప్పటానికి ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా జిల్లాలోని గోరిబజార్ అనే గ్రామంలో జరిగింది. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అవినాష్ కుమార్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరాడు. మొదటి రోజు పాఠశాలకి వచ్చిన ఆయన ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని చూసి నివ్వెరపోయాడు. ఎంతో మంది కూలి పని చేసే వారు ఉన్న ఆ గ్రామంలో ప్రజలు తమ పిల్లలను పాఠశాల పంపించకుండా తమతో కూలి పనికి తీసుకోని పోవటం గమనించిన అవినాష్ కుమార్ ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లల తల్లిదండ్రులని ఒప్పించి పాఠశాలకి వచ్చేలా చేసాడు. దీనితో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠశాల విద్యార్థుల పట్ల తీసుకున్న శ్రద్ధ, ఫలితంగా ఇంతకుముందు చదవటానికి, కనీసం తమ పేరు కూడా రాయటానికి రాని విద్యార్థులు ఏకంగా చదవటం, రాయటంతో పాటు జాతీయ, అంతర్జాతీయ విషయాలు మాట్లాడటం మొదలు పెట్టారు.

ఇంతలోనే ఆ ఉపాధ్యాయుడి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ ఉపాధ్యాయుడి వీడ్కోలు చెప్పే రోజు ఆ పాఠశాలలోని విద్యార్థులతో పాటు ఆ గ్రామంలో ప్రజలంతా కన్నీరు మున్నీరుగా విలపించటం చూస్తే సమాజంలో గురువుల పాత్రను గుర్తుచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే అందరు ఉపాధ్యాయులు అవినాష్ కుమార్ లాగా నిబద్ధతతో చేస్తే భారత దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.
