Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Saturday, October 01, 2016

Mana Kamareddy

మీకు కంట నీరు తెప్పించే ఉత్తరం: మనసుతో చదవండి!!


న భార్యని కోల్పోయి వృద్ధాశ్రమంలో ఉంటున్న ఒక తండ్రి, తన కొడుకు పట్ల చూపిస్తున్న ప్రేమ, అనురాగానికి తార్కాణం ఈ లేఖ...
ఏరా నాన్నా!
బావున్నావా!?
నీకు, జ్వరమొచ్చిందని విన్నాను?
జాగ్రత్త నాన్నా!!
వర్షంలో తిరగకురా,
నీకది పడదు!
మీ అమ్మే ఉంటే -
వేడినీళ్ళలో విక్సేసి
నీకు ఆవిరి పట్టుండేది!
కోడలి పిల్లకది తెలియదాయే!!

కోడలంటే గుర్తొచ్చింది
అమ్మాయెలా ఉంది!?
పిల్లలు బావున్నారా!?

నాన్నా, రేపు వినాయక చవితి కదా -
ఇల్లు శుభ్రంగా కడిగించి,
గుమ్మాలకు నాల్గు మామిడాకులు కట్టు!
పిల్లలు, కోడలితో కలసి
వ్రతపూజ చేసుకోనాన్నా!
మంచి జరుగుద్ది!!
వీలైతే బీరువాలో
అమ్మ కోడలి పిల్లకు ఇష్టపడి
కొన్న పట్టు చీరుంటుంది,
పూజనాడైనా కట్టుకోమను
కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉంటుంది!
తనకిష్టం లేదంటే బలవంతపెట్టకు నాన్నా!!

పిల్లలు బాగా చదువుకుంటున్నారా!?
ఎప్పుడూ పననక
వాళ్ళతో కూడా కొంచెం గడపరా!
పాపం పసివాళ్ళు బెంగపెట్టుకు పోతారు!!
రాత్రులు నీతికథలు చెప్పు
హాయిగా నిద్రపోతారు!!

ఇక నా గురించంటావా!?
బానే ఉన్నానురా!
నువ్వీ ఆశ్రమంలో చేర్పించి
వెళ్ళిననాటి నుండి ఏదో అలా కాలక్షేపమై పోతుంది!
నాలాంటి వయసు పైబడిన వాళ్ళందరం
గతాన్ని నెమరేసుకుంటూ గడిపేస్తున్నాం!!

ఈమద్య మోకాళ్ళు
కొంచెం నొప్పెడుతున్నాయి....
అయినా పర్లేదులే పోయిన పండుగకు
నువ్వు కొనిచ్చిన జండూబాం అలాగే ఉంది!
అది రాసుకుంటున్నానులే!!

అన్నట్లు చెప్పడం మరిచా -
మొన్న ఆశ్రమానికి దొరలొచ్చి
మాకు రెండేసి జతల బట్టలిచ్చి వెళ్ళారు!
నాకీ సంవత్సరానికి అవి సరిపోతాయి
కాబట్టి నాకు బట్టలేం కొనకు,
ఆ డబ్బులతో కోడలు పిల్లకు
ఓ చీర కొనిపెట్టు సంతోషిస్తుంది!
ఈమద్య చూపు సరిగా ఆనక
అక్షరాలు కుదురుగా రావడం లేదు,
వయసు పైబడిందేమో
చేతులు కూడా కాస్త వణుకుతున్నాయ్!

అన్నట్లు మొన్నొకటో తారీఖున
అందుకున్న పెన్షన్ డబ్బులు
నువ్వు పంపిన కుర్రోడికిచ్చాను అందాయా?!
ఇక్కడివాళ్ళు కళ్ళజోడు మార్పించుకోమన్నారు....
కానీ నీకేదో అవసరమన్నావు కదా
అందుకే పంపేసాను!
అవసరం తీరిందా నాన్నా!

బాబూ ఒక్క విషయంరా....!
ఈమద్య ఎందుకో అస్తమాను
మీ అమ్మ గుర్తొస్తుంది!
నీరసమెక్కువై గుండె దడగా కూడా ఉంటుంది,
మొన్నామద్య రెండు, మూడు సార్లు
బాత్రూంలో తూలి పడిపోయాను కూడా
పెద్దగా ఏమీ కాలేదు గానీ,
తలకు చిన్న దెబ్బ తగిలిందంతే!!
నాకెందుకో పదేపదే
నువ్వే గుర్తొస్తున్నావు నాన్న!

నీకేమైనా ఖాళీ ఐతే -
ఈ నాన్ననొచ్చి ఒకసారి చూసిపోరా!
ఆ తరువాత నాకేమైనా హాయిగా పోతాను!!

చివరిగా ఒక్క కోరిక నాన్నా!
నాకేమన్నా అయ్యి
నువ్వు రాకుండానే నే పోతే -
నన్నిక్కడ ఆనాధలా ఒదిలేయక -
మన పొలంలో మీ అమ్మకు నే కట్టించిన
సమాధి ప్రక్కనే నన్నూ పడుకోబెట్టరా!!
ఈ ఒక్క కోరికా తీర్చు నాన్నా!!
ఇక నేనేమీ కోరుకోను!!

విసిగిస్తున్నానేమో..
ఉంటాను నాన్నా!!
ఆరోగ్యం జాగ్రత్త!!

ప్రేమతో,
- నీ నాన్న!


Subscribe to this Mana Kamareddy Portal via Email :