Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, June 20, 2017

Mana Kamareddy

దోమకొండ సంస్థానం చరిత్ర..మన కామారెడ్డి: తెలంగాణలో వున్న సుప్రసిద్ధ 294 చారిత్రాత్మక కట్టడాలలో ఒకటైన దోమకొండ కోట కామారెడ్డి జిల్లాలో నెలకొని ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సుమారు ఇరవై కిమీల దూరంలో, అలాగే 44వ నెంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగనాణానికి (బిటిఎస్, భిక్కనూరు) కి ఐదు కిమీ ల దూరంలో ఉంటుంది. క్లిక్ చేసి దోమకొండ కోట సంబంధించిన ఫోటో గ్యాలరీ చూడండి.
దోమకొండ కోట నిర్మాణం 38 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కామారెడ్డి జిల్లాలోనే దోమకొండ గడీ కోట సుప్రసిద్దమైంది. ఇందులో రాజుల సేవకులు, సైనికులు, ఆశ్వాలు, ఏనుగులు ఈ కోటలోపల ఉండేవని పెద్దలు చెబుతుంటారు. ఈ కోటలో మహాదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి రాణి రుద్రమదేవి వచ్చి పూజలు చేసి వెళ్లినట్లు కోటలోని మహాదేవుని ఆలయం వద్ద వున్న శిలాశాసనంలో ఉంది. కోటలో కళ్యాణి చాళుక్య శాసనం ఉంది. మండల కేంద్రమైన దోమకొండను మధ్యయుగ, ఆధునికయుగాన బహమని కుత్‌బ్‌షాహి, నిజాంషాహి రాజులకు కామినేని వంశప్రభువుల సామంతులుగా ఉండి పాలించారు. వీరు గొప్ప పాలకులుగా, సాహిత్య పోషకులుగా పిలవబడ్డారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా సుందర భవనాలను నిర్మించుకున్నారు. అందులో ప్రత్యేకమైనది అద్దాల మేడను 1922 నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇందులో కోట లోపల స్నానాల బావి ప్రత్యేకంగా నిర్మించారు. దీనిని కాపాడుకునేందుకు వారి వారసులైన కామినేని ఉమాపతి, వారి కుమారుడు అనిల్ కోటకు మరమ్మతులు చేయిస్తున్నారు. దీనిని రాంచరణ్ ఉపాసనల నిశ్చితార్థం దోమకొండ కోటలో జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రజలతో పాటు విద్యార్థులు సందర్శకులతో కోట కళకళలాడుతుంది. కోటలో ఈ మధ్యన వివిధ లఘు చిత్రాల షూటింగ్‌లు సైతం జరుగుతున్నాయి. మండలంలోని బీబీపేట్ గ్రామం 20వ శతాబ్ధి ప్రారంభ వరకు దోమకొండకు జాగీరుగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అనంతరం బీబీపేట, యాడారం, జనగామ, కూతవేటు దూరంలో ఉన్న అంచనూరు పాపన్నపేట సంస్థానంలో విలీనం అయినట్లు సమాచారం. అంబారిపేట్‌లో మధ్యయుగంనాటి చారిత్రక ఆలయాలు ఉన్నాయి. యాడారంలో కళ్యాణి చాళుక్యులు శాసనం ఉంది. వీటిని బట్టి దోమకొండ కోటకు చాలా సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుంది. రాజులు, రాజ్యాలు, కోటలు సంస్థానాలు గతకాలపు వైభవపు చిహ్నాలు, వారి ఆధీనంలో కోటల్లోని చిత్ర శిల్పకళలు కొన్ని చెరిగిపోగా వాటిని గత కాలంలో ఎలా నిర్మించారో ప్రస్తుతం అంతటి పరిజ్ఞానంతో నిర్మించిన దోమకొండ సంస్థానం స్వాతంత్ర సంస్థానంగా నిలుపుకోవడం విశేషం. 

17వ శతాబ్ధపు పూర్వవైభవంలో రేచర్ల గోత్రికులైన కామినేని వంశానికి చెందిన రాజన్న చౌదరి (భిక్కనవోలు) నేటి భిక్కనూరు కేంద్రంగా పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది. తదనంతరం కాలంలో దోమకొండ కోటను నిర్మించారు. కోట నిర్మాణం పూర్తయిన తరువాత దోమకొండ మండల కేంద్రంగా పరిపాలన చేపట్టారు.ఈ కోట అత్యంత భద్రతకు కళాతోరణంగా నిలిచింది. కోట చుట్టూ ఎత్తైన బురుజులు వాటిపై మరఫిరంగులు, నగార ఏర్పాటు చేసి నిఘా ప్రతిష్టకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. తూర్పు, పడమర అత్యంత ఎత్తైన ధర్వాజాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దర్వాజాల తలపులపై బళ్లాలను నగిశీలతో అమర్చి ఏనుగులు చేదించినా తెరచుకోలేనంత పతిష్టంగా నిర్మాణం చేశారు. కోట చుట్టూ శత్రుధుర్బేజంగా కందకంలో నీటిని నింపి మొసళ్లు, జలగలు, పాములు, విష పురుగులను అందులో పెంచేవారని పూర్వీకుల సమాచారం. అర ఫర్లాంగుకు ఓ బురుజు, బురుజుపై నగార సిబ్బంది ఉండేవారు.


మహాదేవుని ఆలయం

కోటలో లోపలవైపు ఉన్న భవనాల్లో దర్భారు హాలు, నాట్యశాల, అంతఃపురం, అద్దాల మేడ ప్రముఖమైనది. అద్దాల బంగ్లా అత్యంత సుందరంగా శిల్ప చాతుర్యంతో నిర్మితమైంది. గోడలు అత్యంత నునుపుగా అద్దంలా ప్రతిభింభించి కనిపించేటట్లుగా ఉండేవని చెప్తుంటారు. అంతరంగిక సమావేశాలకు నాట్య ప్రదర్శనశాలను, అద్దాల మేడను ఉపయోగించేవారట. వీటి సమీపంలోనే పౌన్‌టెన్‌లు, నీటి కొలనులు, తోటలు, ఊటబావులు ఉన్నాయి. ఈ భవనానికి సమీపంలో సైనిక నివాసాలు, ఆశ్వసోరంగ మార్గాలున్నాయి. ఈ మార్గాలు ఒకటి డిచ్‌పల్లి, మరొకటి బిక్కనూర్‌లోని సిద్దరామేశ్వర ఆలయంలోని కోనేరు వరకు ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 12వ శతాబ్ధంలో కాకతీయ పాలనలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతుంది.ఈ ఆలయంలో నంది, శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉంటాయి. ఆలయాన్ని ఇటీవల తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, పురావస్తు శాఖలు పునర్నిర్మాణం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో 294 చారిత్ర కట్టడాలను గుర్తించినట్లు, పురావస్తు శాఖ ఏడీ తెలిపారు. అందులో దోమకొండ కోట ఒకటి అన్నారు.

దోమకొండ సంస్థానాన్ని కామినేని వంశానికి చెందిన ఏడుగురు రాజులు పరిపాలించారు. 1948 సెప్టెంబర్ 15న రాజు ఉమాపతి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వంతో విలీనమైందని తెలుస్తుంది. స్వతంత్య్ర సంస్థానంలో పాలన రాజకీయ, సామాజిక పరిస్థితులు అప్పటి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. దొరల పాలనలో గ్రామ స్థాయి, సమాచార నిఘా వ్యవస్థలు పటిష్టంగా ఉండేవి. భూమిపై హక్కు కొందరికే ఉండేది. శిస్తు వసూళ్ల రూపంలో ఖజానాకు ద్రవ్యం లభించేది గ్రామాల్లో బానిసత్వం. నౌకరి విధానం ఉండేది. పోలీస్ పటేల్ నిధులను నిర్వహించేవారు. సుంకాలను గ్రామ సమాచారాన్ని పటేల్, పట్వారిలకు అందజేసేవారు. చట్టాన్ని ధిక్కరించే వారికి కఠినమైన శిక్షలు విధించేవారు. గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు, కాలిబాటలు ఉండేవి. సంస్థాన పాలకులు గుర్రాలు, రథాలను ఉపయోగించేవారు. సంపన్న వర్గం వారు కచ్చూరాలను వాడేవారు. మేనలు, పల్లకిలు, బోయిలు మోసుకెళ్లేవారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేది. సంస్థానం పాలకులు వేటను క్రీడాంశంగా చేపట్టేవారు. పులుల వేట వీరత్వానికి ప్రతీకగా నిలిచేది. 1948లో నిజాం పరిపాలనతో పాటు దోమకొండ సంస్థాన విలీనం అనంతరం దోమకొండ సంస్థాన విలీనం అనంతరం దోమకొండ పిర్కగా ఏర్పడింది. ఇది దోమకొండ తాలూకాలో అంతర్భాగమైంది. 1905లో దోమకొండ, ఎల్లారెడ్డి తాలుకాలు ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో అంతర్భాగమయ్యాయి.

సంస్థానంలో సాహితీ సేవ…

దోమకొండ సంస్థానంలో సాహిత్య సేవలో విశిష్టత పొందింది. విజయనగర సంస్థానానికి వచ్చినంత కీర్తి దోమకొండ సంస్థాన కవుల ఆదరణతో లభించింది. సంస్థాన వారసులైన ఎల్లారెడి, మల్లారెడ్డి స్వయంగా కవులుగా వివిధ రచనలు చేయడం విశేషం. వీరితో పటమెట్ల పోమమనాధుడు ఉమపద్యాబ్యుదయ వంశారుషి, పద్మపురాణం వంటి కావ్యులు ఈ సంస్థానంలో వెలుగు చూసిన గ్రంధాలు, తెలుగు భాషతోపాటు ఉర్దూ, పార్షి, అరబి భాషలకు కూడా ఇక్కడ సమానాదారణ లభించింది. త్రిభాష నిఘంటువులను రూపొందించడంలో సాహిత్య సేవలు చేశారు. దోమకొండ విలీనం అనంతరం 1966 నుండి 1968 వరకు కోటలోని అద్దాల మేడలో భారత్ సేవక్ సమాజ్ నేతృత్వంలో జనతా కళాశాల పనిచేసింది. ఈ కళాశాలలో యువతకు సామాజిక సేవ కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేవారు. మూడు బ్యాచులు పూర్తయిన వెంటనే మధ్యంతరంగా కళాశాల మూత పడింది. కళాశాలలో అభినవ పోతన బిరుదాంకితులైన వానమామలై పరాదచార్యులు పనిచేయడం విశేషం. సంస్థాన చరిత్ర సాహిత్యంపై కామారెడ్డి ప్రాచ్య కళాశాలకు చెందిన లెక్చరర్ మేడవరపు అనంత శర్మ పరిశోధనా వాస్యం సమర్పించి విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందారు.

వ్యవసాయమే ప్రధానం…

దోమకొండ సంస్థానం పరిధిలో వ్యవసాయమే ప్రధానంగా ఉండేది. అందుకే సంస్థాన పరిధిలో  85 గొలుసుకట్టు చెరువులు ఉండేవి. ఆనాటి పాలనలో రౌతు వారి పద్దతి అమలు అయ్యేది. భూమి యాజమాన్యపు హక్కులు జమిందారి పేరిట ఉండేవి. రైతులు కౌలు వ్యవసాయం చేసేవారు. వెట్టి చాకిరి విధానం కొనసాగేది. ఈ ప్రాంతంలో వర్షాధార పంటలతో పాటు పెద్ద, చిన్న చెరువులు, కుంటల కింద వ్యవసాయం సాగు చేసేవారు. దోమకొండ కోటను ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో పురావస్తు శాఖ, పర్యాటక శాఖ ఆధీనంలోకి ప్రభుత్వం తీసుకుంది. కోటలోని చారిత్రక సంపదను రక్షిస్తూ, శిల్పకలను కాపాడటానికి మరమ్మతులు జరుగుతున్నాయి.

ఈలాంటి చారిత్రిక కట్టడాల ప్రాధాన్యతను భావితరాలకు అందించడానికి ఈ సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుపుతూ..
-మన కామారెడ్డి 


Subscribe to this Mana Kamareddy Portal via Email :