Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, July 25, 2017

Mana Kamareddy

తెలంగాణ యాసను బతికించిన ఫిదా సినిమా..ఈ నెల ఇరవైఒకటో తారీఖున విడుదలై మంచి పేరు తెచ్చుకున్న 'ఫిదా' సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే గి సినిమా షూటింగ్ తొంభై శాతం మన కామారెడ్డి జిల్లాలో జరగటమే. ప్రధానంగా బాన్స్ వాడ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల మండలాలైన బీర్కూర్ , గాంధారి మండలాల్లో షూటింగ్ జరిగింది. సినిమాలో చూపించిన కొన్ని ప్రాంతాలను చూస్తుంటే ఇంత అందమైన ప్రదేశాలు మన జిల్లాలో ఉన్నాయా అని ఆశ్చర్యం వేసింది. అలాగే ఒక పాటలో గాంధారి ప్రాంతంలో నివసించే గిరిజనుల (కోయ లంబాడిల) నృత్యాలను, అక్కడి ప్రాంతాలను చూసిన తర్వాత మనసు  పులకరించింది.


తెలుగు సినిమాలందు ఫిదా లెస్స.. 
(ఫేస్బుక్ పోస్ట్ .. యథాతథంగా)
గ్రాంథికమే ఐనా... మనకు బాగా తెలిసిన మాట కదా అందుకే అట్ల చెప్పిన. 

మనం నిజం ఒప్పుకోవాలె.. 

మన భాషల మాట్లాడాలంటే మనకే నామోషీ. సిగ్గనిపిస్తది నట్టింట్ల ఓటి మాట్లాడుతం. పదిమందిలకు పోంగనే మాట తీరు మార్చుతం. మనల ఉన్న షానిగాడు బైటికస్తడు. పోజు దొబ్బుతడు. పక్కోడు మన యాసల మాట్లాడితే.. పల్లెటూరోడు అంటం. ఊరోనిలెక్క అదేం భాషరా అంటం. అబ్బా సూడు వాని షాని కొట్టుడు.. అని ఎచ్చిర్కాలు ఆడుకుంటం. ఇది తెల్వకుండనే మనకు అల్వాటైపోయింది. మన నరాలల్ల పాకిపోయింది. 

మనం నిజం ఒప్పుకోవాలె.. 

అఫీషియల్ గ.. ప్రొఫెషనల్ గ చెప్పాల్నంటే...మనం మన భాషను దేఖం. మన భాషను కానం. మన యాసను గుర్తించం. మనల్ని మనమే తొక్కుకుంటం. పక్కోడు తొక్కుతుంటే సూస్కుంట కూసుంటం. మొన్నటిదాన్క దిక్కుమొక్కు లేకుండ పోయిన మన మాట... ఇపుడిప్పుడే లేస్తంది. మనమే తొక్కేసిన మన భాష ఇపుడు దాని సొగసు ఏందో సూపెడ్తంది. మనం చేసిన తప్పును మనకే చూపిస్తంది. 

మనం నిజం ఒప్పుకోవాలె...

తీన్మార్ వార్తలు.... పెళ్లిచూపులు, ఫిదా సినిమాలు... మన తప్పును మనకు సూపెడ్తున్నయ్. మనల్ని మనకే మళ్లా కొత్తగ పరిచయం చేస్తున్నయ్. లేకపోతే... రోజూ మనం మాట్లాడే భాష టీవీల వినిపిస్తే మనం రేటింగ్ ఇస్తమా... సినిమాల చూపిస్తే సూపర్ హిట్ చేస్తమా. కని చేస్తున్నం. ఎందుకంటే అవి మనం తొక్కేసిన ఒక నిజాన్ని బైట పెడ్తున్నయ్. ఇదే నీ నిజమైన బతుకు... నువ్వు ఇట్ల మాట్లాడ్తెనే కరెక్ట్ అని చెప్తున్నయ్. లేనిదానికి కప్పుకుని తిరగకు అని అంటున్నయ్.

మనం నిజం ఒప్పుకోవాలె..

ఫిదా సినిమా చూస్తున్నంత సేపు.. మా ఇంట్లనే ఉన్నట్టనిపిచ్చింది. మా ఇంట్లనే పెండ్లి ఐతుందనిపిచ్చింది. మా పక్కింటోళ్లు, ఇంటిముందటోళ్లు మాట్లాడుకుంటున్నరు అనిపిచ్చింది. మా ఊళ్లె తీసిన సినిమానే అనిపిచ్చింది. మన భాషనే క్యారెక్టర్లు అచ్చుగుద్దినట్టు మాట్లాడుతుంటే.. మస్తనిపిచ్చింది. మస్తు తెలుగు సినిమాలు చూసిన. కని.. ఫిదా చూసినప్పుడు కలిగిన.. ఈ సొంత ఫీలింగ్ మాత్రం ఎన్నడూ రాలే. మనకు మన భాష అంటే నచ్చదు. కని.. దాన్నే ఎత్తుకుని... తెలంగాణ పల్లె వాసనతో సినిమా తీసిన, డైలాగులు రాసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల పెద్ద తోపు కింద లెక్క. తెలంగాణ యాసను ఉన్నదున్నట్టుగా పలికిన సాయిపల్లవీ.. నువ్వు చానా గ్రేట్. ఐనోడే కానని రోజులల్ల.. కొందరు గొప్పవాళ్ల వల్ల మన భాష ఇప్పుడిప్పుడే మొస తీస్కుంటంది. దాన్ని థియేటర్ల మాత్రమే కాక... నిజ జీవితంల కూడా బతికియ్యాలె. మనం మనంగ బతకాలె. మాట్లాడాలె. తొంగి చూసే షానిగాన్ని పక్కకు నూకెయ్యాలె. గంతే..

Subscribe to this Mana Kamareddy Portal via Email :